
Shashi tharoor: కాంగ్రెస్ చెప్పింది వారిని.. కేంద్రం ఎంచుకుంది శశిథరూర్‌ని..
Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోన్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు
అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తుండగా.. వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పంపిన
జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదేరోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్
గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం
రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు
దక్కింది. * ఇక పాక్‌పై దౌత్యయుద్ధం.. శశిథరూర్ సహా ఏడుగురు ఎంపీలతో విదేశాలకు బ్రీఫింగ్ అవసరం ఉన్నచోట నేనుంటా.. ‘‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న
బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్ ’’ అని థరూర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా..
ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(భాజపా), బైజయంత్ పాండా (భాజపా) సంజయ్‌కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన)
విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో
ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు ఈ బృందాలు వివరించనున్నట్లు సమాచారం.