
Operation sindoor: అప్పుడు బాలాకోట్.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్.. పాక్‌ను ఏమార్చి దెబ్బకొట్టిన భారత్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ చర్యపై
యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బంధీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలుచేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యూహాలు కీలకంగా నిలిచాయి.
బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్ షాక్‌కు గురికాక తప్పలేదు. బాలాకోట్ దాడి,
ఆపరేషన్ సిందూర్‌ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత
ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. బాలాకోట్ దాడులకు ముందు.. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి
26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన దిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి
అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌పంఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు
భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోదీ దిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి
మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. ఇప్పుడూ అలానే.. బాలాకోట్ దాడికి
ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే.. దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. మంగళవారం
రాత్రి ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘ఇండియా ఎట్ 2047’ సదస్సులో మోదీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని
వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్
డ్రిల్స్‌ను అంతకుముందు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతో.. దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్లాయి. అయితే.. ఇవన్నీ
దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పసిగట్టడంలో.. అప్పుడు బాలాకోట్ దాడుల సమయంలోనూ.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాకిస్థాన్ పూర్తిగా
విపలమైంది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి.