Pm modi address to the nation: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్‌: ప్రధాని మోదీ

Pm modi address to the nation: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్‌: ప్రధాని మోదీ

Play all audios:


దిల్లీ: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్‌ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌


(Operation Sindoor) అనంతరం ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని


స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌’కు పాల్పడితే సహించేది లేదని పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం


లేదని ప్రకటించారు. సైన్యం సాహసం, పరాక్రమానికి సెల్యూట్‌  ‘‘కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం, సహనాన్ని రెండింటినీ చూశాం. భారతదేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలు, నిఘా సంస్థలు,


శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సెల్యూట్‌ చేస్తున్నా. మన వీర సైనికులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు. వారి వీరత్వం, పరాక్రమం,


సాహసానికి సెల్యూట్‌ చేస్తున్నా.. మన దేశంలోని ప్రతి తల్లి, ప్రతి సోదరి, ప్రతి కుమార్తెకు ఈ పరాక్రమం అంకితం. పహల్గాంలో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు. ఈ ఘటన దేశాన్ని, యావత్‌ ప్రపంచాన్ని


వణికించింది. సెలవుల్లో గడిపేందుకు వెళ్లిన అమాయకులను మతం అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే నిర్దయగా కాల్చి చంపారు. ఇది ఉగ్రవాద బీభత్సానికి, క్రూరత్వానికీ ప్రతీక. దేశంలోని సౌభ్రాతృత్వాన్ని


దెబ్బతీసే ప్రయత్నమిది. వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలిగించింది. ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కల్పించాం’’ బెంబేలెత్తిన పాక్‌.. చర్చలకు


పరుగెత్తుకొచ్చింది.. ‘‘పౌరులు, పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచాయి. భారతీయ మహిళల నుదుట సిందూరాన్ని చెరిపేస్తే.. దానికి సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది,


ఉగ్రసంస్థకూ అర్థమైంది. ఆపరేషన్‌ సిందూర్‌.. ఒక పేరుకాదు.. ఇది దేశంలోని కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ న్యాయం కోసం ఒక అఖండమైన ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞతోనే


ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్‌ దెబ్బతీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బహావల్‌పుర్‌, మురుద్కే లాంటి తీవ్రవాద


స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని సృష్టించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో  భారత్‌ చెప్పింది. పాక్‌ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం


చేశాం. పాకిస్థాన్‌ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసుకొచ్చింది. మన చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్థాన్‌ కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్‌ డీజీఎంవో కాల్పుల విరమణ


చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు’’ పాక్‌ రక్షణ వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం.. ‘‘రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్‌ తుడిచిపెట్టింది.


మనదేశానికి వ్యతిరేకంగా పాక్‌ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతండాలను తుదముట్టించింది. మన దెబ్బకు పాక్‌ నిరాశనిస్పృహల్లో కూరుకుపోయింది. అచేతనావస్థకు చేరుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్


చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్థాన్‌.. భారత్‌పై దాడిని ప్రారంభించింది. మన స్కూళ్లు, కాలేజీలు, గురుద్వారాలు, సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. మన సైనిక


స్థావరాలను టార్గెట్‌ చేసుకుంది. దీంతో పాక్‌ నిజస్వరూపం, కుట్రలు బట్టబయలయ్యాయి. పాక్‌ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. పాక్‌


రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్‌ వైమానిక స్థావరాలు, రాడార్‌ స్టేషన్లలో మన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ అసహ్యకరమైన


సత్యాన్ని ప్రపంచం మరోసారి చూసింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి?’’ భారత్‌


నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ‘‘ఎలాంటి దుస్సాహసానికి పాక్‌ తెగబడినా మన దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలాకోట్ దాడులు, ఆపరేషన్‌ సిందూర్‌.. ఉగ్రవాదంపై


భారత్‌ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై షరతుల మేరకే చర్చలు ఉంటాయి. మన నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్థాన్‌ అణు బ్లాక్‌మెయిలింగ్‌ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాల


ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా  భారత్‌ తుదముట్టించి తీరుతుంది. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్‌ సిందూర్‌


ద్వారా పాక్‌ చవిచూసింది. సాంకేతిక యుద్ధంలో భారత్‌ పరిణతి, ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. మేడిన్‌ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో.. ఎంత శక్తిమంతమైనవో చాటింది’’ పాకిస్థాన్‌ బతికి


బట్టకట్టాలనుకుంటే.. మోదీ సీరియస్‌ వార్నింగ్‌ ‘‘ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్‌ వెనుకాడదు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు


అందించే ఎవరినీ ఉపేక్షించదు. పాక్‌ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకకాలంలో ఉండవు. రక్తం, నీరు రెండూ


కలిసి ప్రవహించలేవు. పాక్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే’’ అని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ తీరును ఎండగడుతూనే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.