Dinesh karthik: దినేశ్‌ కార్తిక్‌.. కోచ్‌గానూ గ్రేట్‌ ఫినిషరే

Dinesh karthik: దినేశ్‌ కార్తిక్‌.. కోచ్‌గానూ గ్రేట్‌ ఫినిషరే

Play all audios:


_ఆర్సీబీ కల నెలవేరింది. ఎన్నోఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్‌ కప్పు వచ్చి ఒళ్లో వాలింది. గజినీ మహమ్మద్‌ 17 సార్లు దండయాత్ర చేసి 18వ సారి విజయం సాధించినట్లు.. రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కూడా


17 సార్లు ప్రయత్నించి.. 18వ సీజన్‌లో తన తొలి ట్రోఫీని ముద్దాడింది. ఈ గెలుపు కేవలం జట్టుదే కాదు. వెనకుండి.. వెన్నుతట్టి.. మెరుగుపెట్టి.. పట్టుబట్టి.. టీమ్‌ను ముందుకు నడిపించిన కోచ్‌, మెంటార్‌


దినేశ్‌ కార్తిక్‌ది కూడా! ఈ అపూర్వ విజయంలో అతడి పాత్ర అమోఘం. అతడి అంకితభావం అనిర్వచనీయం. _ గత ఏడాది వరకు దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal


Challengers Bengaluru) టీమ్‌లో సభ్యుడే. ఐపీఎల్‌కు (IPL) రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత, అతడి సేవల్ని ఆర్సీబీ మరో రూపంలో వాడుకోవాలనుకుంది. అందుకే అతణ్ని బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. ధోనీ


(MS Dhoni) తర్వాత మరో గ్రేట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న దినేశ్‌ కార్తిక్‌ ఈ ఐపీఎల్‌ 18వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కప్పు గెలుచుకునేలా చేసి కోచ్‌గానూ గ్రేట్‌ ఫినిష్‌ అందించాడు.


పూర్తి అవగాహనతో.. తనను ఆర్సీబీ యాజమాన్యం కోచ్‌గా నియమించిన తర్వాత.. తన ముందున్న ఆశయం ఏంటి? తన కర్తవ్యం ఏంటన్న విషయాల మీద దినేశ్‌ కార్తిక్‌ స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. ‘నేను ఇప్పుడు కోచ్‌


బాధ్యతల్లోకి వచ్చా. మెగా వేలం నుంచే జట్టుకు సంబంధించి సన్నద్ధతపై అవగాహన తెచ్చుకున్నా. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంపై దృష్టిసారించా. ఇప్పుడీ జట్టును చూస్తుంటే బాగుంది. ఆర్సీబీలో స్వదేశీ,


విదేశీ ప్లేయర్లందరినీ సమానంగా చూస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో వారు ఎలాంటి పాత్ర పోషించాలనేది చెబుతాం’ అని డీకే తాను కోచ్‌ పదవి చేపట్టిన మొదట్లో ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించాడు. ఈ మాటల్ని బట్టే


చెప్పొచ్చు.. అతడు తన జట్టు విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నాడో! కోహ్లీ మనసు దోచాడు! ‘దినేశ్‌ కార్తిక్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు.. నాకు 2022 ఐపీఎల్ సీజన్‌ గొప్పగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం విషయంలో చాలా


ఇబ్బందిపడ్డా. అప్పుడు పక్కనే కూర్చొని సవివరంగా నా సమస్యను చెప్పాడు. ఎలా అధిగమించాలనే దానిపై అవగాహన కల్పించాడు. ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటా. థాంక్యూ డీకే.. నీ అమూల్యమైన సలహాలతో మెరుగ్గా


రాణించగలుగుతున్నా’ అని గతంలో ఓసారి విరాట్‌.. దినేశ్‌ కార్తిక్‌ గురించి చెప్పాడు. అతడు జట్టులో ఆటగాడిగా ఉంటూనే ఆర్సీబీ స్టార్‌ బ్యాటరైన కోహ్లీకి మార్గనిర్దేశనం చేశాడు. ఇప్పుడు కోచ్‌


అవతారమెత్తిన తర్వాత విరాట్‌లో మరెంత స్ఫూర్తి రగిలించి ఉంటాడో కదా! ఒకప్పుడు స్పిన్‌ బౌలింగ్‌లో కాస్త ఇబ్బందిపడే కోహ్లీ.. ఇప్పుడు గింగిరాలు తిరిగే బంతులను కూడా అలవోకగా బౌండరీకి తరలించడాన్ని


మనం ఈ సీజన్‌లో స్పష్టంగా గమనించే ఉంటాం. ఆటగాళ్ల లోపాలను పసిగట్టి.. వాటిని అధిగమించేలా చేయడంలో దినేశ్‌ కార్తీక్‌ది అందెవేసిన చేయి! ఇటీవల ఓ సందర్భంలో ‘కోహ్లీ ఇప్పుడు స్పిన్‌ కూడా చక్కగా


ఆడుతున్నాడు’ అని ఈ కోచ్‌ కాంప్లిమెంట్‌ కూడా ఇచ్చాడు! యువ రక్తానికి ప్రోత్సాహం.. జట్టుకు యువఆటగాళ్లే జీవం. వారి ఆటే ప్రాణం! ఈ విషయాన్ని ఆర్సీబీ కోచ్‌ దినేశ్‌ కార్తిక్‌ గుర్తించాడు. ‘‘కోహ్లీ


ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వెళ్లాను. మా కోచ్‌ దినేశ్‌ కార్తిక్‌.. ‘బాగా ఆడి.. జట్టును గెలిపించు’ అని సూచించాడు. ఆ మాటలే నాలో స్ఫూర్తిని నింపాయి. నేను తర్వాత మ్యాచుల్లో కూడా ఇదే ఆటతీరును


కొనసాగించే ప్రయత్నం చేస్తాను’’ అని జితేశ్‌ శర్మ ఈ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో (Lucknow Super Giants) జరిగిన మ్యాచ్‌ అనంతరం అన్నాడు. ఈ మ్యాచ్‌లో జితేశ్‌ 33 బంతుల్లోనే 85 రన్స్‌


చేశాడు. తర్వాత కొన్ని మ్యాచ్‌లకు జితేశ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఈ వ్యూహం వెనుకా కోచ్‌గా దినేశ్‌ పాత్ర ఉంది! బౌలింగ్‌ మీదా అవగాహన.. దినేశ్‌ కార్తిక్‌కు బౌలింగ్‌ మీద కూడా పట్టుంది!


ముఖ్యంగా యశ్‌దయాళ్‌ను అతడు తీర్చిదిద్దిన తీరు అమోఘం. ‘భారత్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో యశ్‌ దయాళ్ కూడా ఒకడు. చాలా శ్రద్ధగా పనిచేసే క్రికెటర్. జట్టు సమావేశానికి వచ్చినప్పుడు ఓ కాగితం తీసుకొచ్చి


ఏం చేయాలనుకుంటున్నాడో రాసుకునేవాడు. ఎప్పుడూ తనకంటూ ప్రణాళికలు ఉంటాయి. ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండటం వల్లే అతడిని రిటైన్‌ చేసుకొన్నాం’ అని దినేశ్‌ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. 


క్రికెట్‌ హాలిక్‌..! దినేశ్‌ కార్తిక్‌ క్రికెట్‌ హాలిక్‌! ప్రాక్టీస్‌ సందర్భంగా ఏమాత్రం సమయం వృథా చేయడం అతడికి నచ్చదు. తన జట్టు సభ్యులకే కాదు.. ఇతర జట్టు ఆటగాళ్లను కూడా సమయం వృథా చేయొద్దనే


చెబుతాడు. దిల్లీతో, ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా  దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel), దినేశ్‌ కార్తిక్‌ను పలకరించాడు. అప్పుడు అక్షర్‌ ఏదో జోక్‌ చేశాడు.


‘మంచి సారథిగా ఉండు. ముందు నువ్వెళ్లి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయి. జోక్‌ చేయొద్దు’ అంటూ సుతిమెత్తగా మందలించి, అక్షర్‌తో కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు!  దినేశ్‌ కార్తిక్‌ వర్క్‌కల్చర్‌


గురించి తెలిపే.. ఇలాంటి  సంఘటనలు బోలెడు ఉన్నాయి. ఇవన్నీ  క్రికెట్‌పై ఈ కోచ్‌కున్న అంకితభావానికి అద్దం పట్టేవే. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం ఈ మాజీ క్రికెటర్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము


చేయకుండా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేలా కృషి చేశాడు. _ఇక ఇప్పుడు దినేశ్‌ కార్తిక్‌ ముందున్న టార్గెట్‌ ఐపీఎల్‌ 2026!_ _- ఇంటర్నెట్‌ డెస్క్‌ _