
Brs: కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది: భారాస నేత వినోద్
Play all audios:

రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూశామని మాజీ ఎంపీ, భారాస నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్: రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు
చూశామని మాజీ ఎంపీ, భారాస నేత వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో తమ పార్టీ మొదటిది కాదు.. చివరిది కాదని వ్యాఖ్యానించారు. భాజపాతో పనిచేయాలనుకుంటే
ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమన్నారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసిందని.. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని తెలిపారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు.
కవిత ఏమన్నారంటే? భారాస (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రశ్నించారు. కట్టడి చేయమంటే
పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెబుతూ కోవర్టులు
ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా?ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. ఎంపీగా పోటీ చేస్తే
సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్, భాజపాపై మాట్లాడాలి
కానీ.. నాపై దాడి చేస్తే ఎలా? భారాసను గంపగుత్తగా భాజపాకు అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. భాజపాలో భారాస విలీనం కాకుండా స్వతంత్రంగా
ఉండాలన్నదే నా అభిమతం. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?.. అంత సీన్ లేదు. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ
అబద్ధం. భారాసలో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు... నేరుగానే పోరాడతాను. కొత్త పార్టీ అవసరం లేదు.. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే
చాలు. లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి వందల లేఖలు రాశాను..
తప్పేంటి?సాధారణంగా కేసీఆర్ లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు... బయటపెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా.. లీకు వీరులా? అనేది తెలియాలి’’ అని కవిత
అన్నారు.