
Airtel fraud detection: ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ సదుపాయం
Play all audios:

Airtel Fraud Detection | ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్పామ్ కాల్స్‌కు చెక్
పెట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ఆ సంస్థ.. తాజాగా సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ‘ఫ్రాడ్ డిటెక్షన్’ సదుపాయాన్ని తెచ్చింది. దీంతో వాట్సప్, ఇ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ
సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకుంటుంది. తద్వారా ఎయిర్‌టెల్ యూజర్లను సైబర్ నేరాల బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. మనకొచ్చే
లింక్స్‌ను క్లిక్ చేసినప్పుడు ఈ సిస్టమ్ దాన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ సైబర్ మోసాలకు ఆస్కారం ఉన్న మోసపూరిత లింక్ అయితే.. దాన్ని ఓపెన్ అవ్వకుండా ఈ ఫీచర్ బ్లాక్ చేస్తుంది. ఒకవేళ ఆ లింక్
సురక్షితమని భావిస్తే ఆ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. * వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ
‘తడిసి మోపెడు’..! మొబైల్ బ్రౌజర్, ఇ-మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర యాప్స్ వేదికగా పనిచేస్తుంది. ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్
కస్టమర్లకు ఆటోమేటిక్‌గా ఈ సదుపాయం ఎనేబుల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం హరియాణా సర్కిల్‌లో అందుబాటులోకి తెచ్చారు. త్వరలో దేశవ్యాప్తంగా రోల్‌అవుట్ చేయనున్నట్లు కంపెనీ
వెల్లడించింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వాడుతున్న వారికి ఇప్పటికే ఆటోమేటిక్‌గా స్పామ్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు గుర్తించే సదుపాయం పనిచేస్తోంది. 10 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇదే
తరహాలో ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం కూడా పనిచేస్తుంది.