Shashi tharoor: శశిథరూర్‌పై వేటు వేద్దామా.. వద్దా? భాజపా అస్త్రంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌..

Shashi tharoor: శశిథరూర్‌పై వేటు వేద్దామా.. వద్దా? భాజపా అస్త్రంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌..

Play all audios:


Shashi Tharoor: సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శశిథరూర్‌. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోపే ఆయనపై ఓ నిర్ణయానికి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది.


ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు బృందాల్లో ఒకదానికి కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్ (Shashi


Tharoor) నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వంతో శశిథరూర్‌ బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని నెలలుగా థరూర్‌ తన సొంత


పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యత అప్పగించడం కాంగ్రెస్‌కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఆయనపై వేటు వేయాలా.. వేచి చూద్దామా? అని హస్తం పార్టీలో


తర్జనభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌ను ఎండగట్టే దౌత్యబృందంలో కేంద్రం అన్ని పార్టీల సభ్యులకు చోటు కల్పించింది. ఎంపీలను ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల సిఫార్సులను కూడా పార్లమెంటరీ


వ్యవహారాల శాఖ పరిగణనలోకి తీసుకుంది. శశిథరూర్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు. పేర్లు ప్రతిపాదించాలని తమను కోరి, పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా


థరూర్‌ పేరును ప్రకటించడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇదొక్కటే కాదు.. ఇటీవల ప్రధాని మోదీ కేరళ పర్యటనలో భాగంగా ఒకే వేదికపై ఈ ఇద్దరు నేతలు కనిపించారు. ‘‘ఈ రోజు శశిథరూర్‌ ఇక్కడ


ఉన్నారు. ఈ ప్రోగ్రామ్‌ కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది’’ అని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆ మధ్య ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్‌ పార్టీ మారనున్నట్లు ప్రచారమూ


జరిగింది. ఇక, భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ థరూర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  * అమెరికాకు థరూర్‌ బృందం థరూర్‌ పార్టీలోనే కొనసాగుతూ.. భాజపా చెప్పినట్లుగా


ఆడుతున్నాడని హస్తం పార్టీ అనుమానిస్తోంది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ తిరువనంతపురం ఎంపీ వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరగకముందే.. ఆయనపై ఓ నిర్ణయానికి రావాలని


భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఆ బాధ్యతలు అప్పగించగానే ఆయన అంగీకరించడం, కనీసం కాంగ్రెస్ ప్రస్తావన తేకపోవడం రుచించలేదని తెలుస్తోంది. కానీ.. పార్టీ పూర్తి సందిగ్ధతలో ఉంది. పహల్గాం దాడి,


ఆపరేషన్ సిందూర్ విషయాల్లో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇలాంటి సమయంలో థరూర్‌పై వేటు వేస్తే, భాజపా చేతికి ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన


వెళ్తున్నది పార్టీ అప్పగించిన పనిమీద కాదు కదా! ఆయన మీద వేటు వేయడానికి ముందు.. ప్రస్తుతానికి ఆయన భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా కీలక


నేతలను కోల్పోతున్న కాంగ్రెస్‌కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.