
Pm modi speech: ‘ఉగ్రవాదంపై భారత్ వైఖరి సుస్పష్టం’.. మోదీ ప్రసంగంపై ప్రముఖుల స్పందన
Play all audios:

ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రధాని మోదీ ప్రపంచానికి స్పష్టం చేశారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదులను భారత సైన్యం దారుణంగా దెబ్బతీసిందని ప్రధాని
నరేంద్ర మోదీ (PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’పై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
స్పందించారు. ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రధాని మోదీ ప్రపంచానికి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ‘‘ప్రధాని ప్రసంగం దేశ స్ఫూర్తిని చాటడమే కాకుండా.. మన సైనిక, దౌత్య, నైతిక సామర్థ్యాలను కూడా
ప్రతిబింబిస్తోంది. భారత సాయుధ దళాల శౌర్యపరాక్రమాలపై యావత్‌దేశం గర్విస్తోంది. ప్రధానమంత్రి బలమైన నాయకత్వానికి కృతజ్ఞతలు’’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. * ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా దేశ
శత్రువులకు వారి హద్దులేంటో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్థాన్ పెరటిలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. - అమిత్ షా, కేంద్ర హోం మంత్రి * ‘‘ప్రధాని మోదీ
ఈ రోజు భారత నూతన సిద్ధాంతం గురించి పేర్కొన్నారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ బలం ఏంటో ప్రపంచానికి చూపించారు. ఈ రోజు
బుద్ధ పూర్ణిమ. మనం ఎప్పుడూ శాంతినే కోరుకుంటాం. అయితే శాశ్వత శాంతి కొనసాగాలంటే బలం ద్వారానే సాధ్యమవుతుందని చరిత్ర చెబుతోంది. అయితే ఉగ్రవాదం విషయంలోనే భారత్ ఎప్పుడూ సహనాన్ని కలిగి ఉండదు.
పురాతన ఆధ్మాత్మిక వారసత్వం, అత్యాధునిక సామర్థ విషయాల్లో భారత్‌ను ఈ రోజు ప్రపంచం గౌరవిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడి ప్రత్యర్థి
కీలక మౌలిక సదుపాయాలను దెబ్బ తీశాం. ఆధునిక యుద్ధాల నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి మేడిన్ ఇండియా డిఫెన్స్ టెక్నాలజీ ఈ రోజు తన సంసిద్ధతను చూపించింది. ఇది ప్రతి భారతీయుడికి ఎంతో
గర్వకారణం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎప్పుడూ ఉన్నతంగా, శాంతియుతంగా, దృఢ సంకల్పంతో ఉంటుంది. భారతీయులంతా ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలి’’ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు * ఉగ్రవాదంపై పోరాటంలో
ప్రతిపక్షాలు ప్రధాని వెంటే ఉన్నాయి. అయితే, పాకిస్థాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రదర్శించాలి. ఇరుదేశాల వివాదంలో అమెరికా జోక్యాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. -
కపిల్ సిబల్, రాజ్యసభ ఎంపీ * ‘‘ప్రధాని మోదీ ఈ రోజు ప్రసంగం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘కొత్త భారత్’ పాలసీని విస్పష్టం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్యనే కాదు. మన సోదరీమణులు,
కుమార్తెల గౌరవాన్ని రక్షించే సంకల్ప బలాన్ని చూపెట్టింది. మన తల్లులు, సోదరీమణుల సిందూరాన్ని తుడిచేయడానికి ప్రయత్నిస్తే ఎవరైనా మట్టిలో కలిసిపోతారనే సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ఇచ్చింది’’-
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ * ఉగ్రవాదులను, వారి స్థావరాలను భారత్ ధ్వంసం చేస్తోంది. ఉగ్రవాదం, చర్చలు ఒకే ఒరలో ఇమడవని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. - హిమంత బిశ్వశర్మ, అస్సాం సీఎం * ప్రధాని
మోదీ ప్రసంగం ప్రతి భారతీయుడిలో విశ్వాసాన్ని నింపుతోంది. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని దేశం స్పష్టం చేసింది. - పుష్కర్‌సింగ్ ధామీ, ఉత్తరాఖండ్
సీఎం * ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించే ప్రభుత్వాలను భారత్ ఎప్పుడూ వేరుగా చూడదని ప్రధాని మోదీ తన చర్యల ద్వారా చూపించారు - మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్