
Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు
Play all audios:

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో
ఆయన క్షమాపణలను అంగీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం.. మంత్రి వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది.
‘‘క్షమాపణలు ఎక్కడ చెప్పారు? ఎలా చెప్పారు? సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారు.
మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న
అభ్యంతరం ఏంటీ?’’ అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. * పాక్ టార్గెట్‌లో గోల్డెన్ టెంపుల్.. గీత కూడా పడనివ్వని భారత ఆర్మీ ‘‘మీరో ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అలాంటప్పుడు బాధ్యతగా
వ్యవహరించాలి. ప్రతీ పదాన్ని ఆచితూచి మాట్లాడాలి. మీ వీడియోను మేం చూశాం. చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మీ వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతోంది’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనంతరం మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రానికి చెందని ముగ్గురు ఐపీఎస్‌లు అందులో ఉండాలని,
వారిలో ఒకరు ఎస్పీ ర్యాంక్ కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. అయితే, ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు.. విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది. పాకిస్థాన్‌తో
పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా (Madhya Pradesh minister Vijay Shah) చేసిన
వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమెను విజయ్ షా ‘ఉగ్రవాదుల సోదరి’గా పేర్కొనడంపై దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఆయనపై
కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన క్షమాపణలు చెప్పాలని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది.