
Shubman gill: టెస్ట్ కెప్టెన్సీ సంగతి తర్వాత.. గిల్ ముందు టీమ్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలి: శ్రీకాంత్
Play all audios:

‘అంతా శుభ్‌మన్ గిల్‌ను కాబోయే కెప్టెన్ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులో స్థానమే పదిలం కాదు. బుమ్రానే కెప్టెన్ చేయాలి’ అంటున్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి
శ్రీకాంత్ ఇంటర్నెట్ డెస్క్: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్‌మెంట్ తర్వాత కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) ఉన్నాయని టీమ్‌ఇండియా
(Team India) మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. శుభ్‌మన్ గిల్‌పై (Shubman Gill) కెప్టెన్సీని రుద్దకూడదని అభిప్రాయం వ్యక్తంచేశాడు. అతడు ముందు టీమ్‌లో కుదురుకొని, స్థానం సుస్థిరం
చేసుకోవాలని సూచించాడు. తన దృష్టిలో గిల్ ప్రస్తుత SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పరిస్థితుల్లో తుదిజట్టులో కచ్చితంగా లేడని పేర్కొన్నాడు. అలాగే బుమ్రా వర్క్‌లోడ్
మీద వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా శ్రీకాంత్ తోసిపుచ్చాడు. కేఎల్ రాహుల్ (KL Rahul), రిషభ్‌పంత్‌లలో (Rishabh Pant)లో ఎవరైనా ఒకర్ని వైస్ కెప్టెన్ చేయాలి. అప్పుడు బుమ్రా ఆడని ఒకటి రెండు
టెస్టుల్లో వీళ్లు కెప్టెన్సీ బాధ్యతలు మోస్తారని చెప్పాడు. ‘‘అంతా శుభ్‌మన్ గిల్‌ను కాబోయే కెప్టెన్ అంటున్నారు. కానీ నా దృష్టిలో అతడికి తుది జట్టులోనే స్థానం పదిలం కాదు. కేఎల్ రాహుల్,
రిషభ్‌పంత్‌కు కెప్టెన్సీ ఇవ్వనిపక్షంలో కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వాలి. నేనే ఒకవేళ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్ అయితే ముమ్మాటికీ బుమ్రాకే కెప్టెన్సీ ఇస్తాను. ‘ఎన్ని మ్యాచ్‌లు వీలుంటే
అన్ని ఆడు. మిగతా బాధ్యతలు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ లేదా రిషభ్ పంత్ చూసుకుంటారు’ అని నేను అతడితో చెబుతాను. ఎందుకంటే టీమ్‌లో ఈ ఇద్దరి స్థానం సుస్థిరం కాబట్టి. సెలక్టర్లు ఏం
ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇదైతే నా ఎంపిక’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ కుండ బద్దలు కొట్టాడు.