'సరి'గా.. 'భేషు'గ్గా!
Play all audios:

దిల్‌సుఖ్‌నగర్‌లో సరి–బేసి మార్కింగ్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది _ఒక అంకానికి తెర పడింది. పట్నం రెక్కలు విచ్చుకుంది. కొత్త ఆశలతో పరుగులెత్తింది. గూటిలోని పక్షి స్వేచ్ఛా కూజితం
ఆలపించింది. కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో నవ జీవితానికి నాంది పలికింది. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన నగరవాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం నగరం నూతన శోభను సంతరించుకుంది.
నవ నవోన్మేషంతో తొణికిసలాడింది. రహదారులపై వాహనాలు రయ్య్‌మంటూ దూసుకెళ్లాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఇటు జిల్లాల నుంచి.. అటు సిటీ శివారు ప్రాంతాల నుంచి బయలుదేరిన
ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వృత్తి వ్యాపారాలు సహా దుకాణాలు, మార్కెట్లలో విక్రయాలు ఊపందుకున్నాయి.వెరసీ.. భాగ్యనగరం పునర్‌వైభవం దిశగా అడుగులు వేసింది._
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ తరుణంలో నగరంలో మంగళవారం నుంచి దుకాణాలు రోజు విడిచి రోజు (ఒన్ బై ఒన్–సరి బేసి పద్ధతిలో) తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు షాపులను
క్రమపద్ధతిలో తెరిచేందుకు నంబర్లు వేయాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు స్పష్టం చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఒక దుకాణం ఒక రోజు
తెరిస్తే.. మరుసటి రోజు మూసివేసి, తిరిగి మర్నాడు తెరచుకోవచ్చు. సరి–బేసి (సోమవారం బేసి 1వ రోజు అయితే , మంగళవారం సరి 2వ రోజు)గా దీన్ని అమలు చేస్తారు. అలాగే షాపుల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ
చేయాలని సూచించారు. పక్కపక్కన ఉన్న షాపుల మధ్య ఏదైనా సమస్య ఏర్పడితే లాక్‌డౌన్ పూర్తయ్యేంత వరకు మూసివేయాల్సిందిగా స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులను విక్రయించే షాపులతో పాటు మెడికల్, పాల
ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల విక్రయాల షాపులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. వాటితో పాటు నిర్మాణ సామాగ్రిని విక్రయించే షాపులు కూడా తెరిచి ఉంచాలని తెలిపారు. మాల్స్, రెస్టారెంట్లు, పబ్స్,
బార్లు, సినిమాహాళ్లు మూసి ఉంచాలని స్పష్టం చేశారు. రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలు పార్సిల్స్ తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట్ సర్కిల్‌లో షాపులను తెరిచేందుకు
చేస్తున్న మార్కింగ్‌లను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ నిబంధనలు తప్పనిసరి ♦ షాపుల్లో పనిచేస్తున్న వారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ♦ కొనుగోలుదారులు కూడా మాస్కులు ధరించి షాపులకు వెళ్లాలి.
♦ నోమాస్కు– నో గూడ్స్/ నో సర్వీస్ నిబంధనను కచ్చితంగా పాటించాలి. ♦ మాస్కు నిబంధనను అతిక్రమిస్తే రూ.1000 జరిమానా విధిస్తారు. ♦ నాలుగు అడుగుల భౌతిక దూరం అమలుకు మార్కింగ్ చేయాలి. ♦ ఎంట్రీ,
ఎగ్జిట్ పాయింట్స్ వద్ద హ్యాండ్ శానిటైజర్ ఉంచాలి. ♦ ఎలివేటర్ బటన్స్, డోర్ హ్యాండిల్స్‌కు రెడ్ కలర్ ఇండికేటర్స్ ఉండాలి. ♦ వీలైన చోట ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేయాలి. ♦ ఈ నెల 31వ తేదీ
వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనల కనుగుణంగా కమిషనర్ ఈ చర్యలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్లు ఇన్‌ఛార్జులుగా
వీటిని అమలు చేయాలని ఆదేశించారు. బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, టౌన్‌ప్లానింగ్, ఏఎంఓహెచ్‌లు తదితర అధికారుల సేవలు వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. అన్నింటికంటే మూలన ఉన్న దుకాణాన్ని
లేదా వీధిలో మొదటి దుకాణాన్ని 1వ నెంబర్ దుకాణంగా పరిగణించాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లలో నో.. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం అన్ని షాపుల్నీ మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరిస్థితి
అదుపులోకి వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాలు తెరిచేందుకు, దుకాణాలు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతులిచ్చిన ప్రభుత్వం అపార్టుమెంట్లు, గేటెడ్
కమ్యూనిటీల్లో పనిమనుషుల సేవలు వినియోగించుకునేందుకు తగిన మినహాయింపులిచ్చింది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్లు తమ సభ్యులందరితో చర్చించి పనిమనుషులతో పాటు ఇతర గృహ
సేవలందించేవారిని అనుమతించేందుకు నిర్ణయం తీసుకోవచ్చు. తగిన రక్షణ చర్యలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అమల్లో ఉన్న భౌతిక దూరం పాటింపు, శానిటైజర్ల వినియోగం, ముఖానికి మాస్కు తప్పనిసరి.
కుటుంబంలోని అందరూ, సేవలందించేందుకు వచ్చేవారూ వీటిని పాటించాలి. వీటికి సంబంధిత అసోసియేషన్ బాధ్యత వహించాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్–2005 మేరకు వీటిని పాటించాలి. ఈమేరకు మునిసిపల్
శాఖ మెమో జారీ చేసింది. ఇప్పుడిప్పుడే.. ఇప్పటికే తెరుస్తున్న ఉన్న మెడికల్‌షాపులు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వంటి నిత్యావసర షాపులు మినహా మిగతా షాపులకు 1, 2 అంకెలుగా నెంబర్లు వేసే పనిని సంబంధిత
అధికారులు చేపట్టారు.