Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

Play all audios:


AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Published : 17 May 2025 13:42 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC


EXTRA LARGE 5 min read ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2025) నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్షకు


జేఎన్‌టీయూ-కాకినాడ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి మొత్తంగా 3,62,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో


ఇంజినీరింగ్‌ విభాగానికి 2,80,597మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి 81,832 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని జేఎన్టీయూ


కాకినాడ వీసీ, ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ ప్రొ.సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ స్పష్టంచేశారు. వీలైనంత త్వరగా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకొని తమకు కేటాయించిన కంప్యూటర్‌ సరిగా పనిచేస్తుందో, లేదో


సరిచూసుకోవాలని సూచించారు. ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్న వారికి కర్నూలు రీజనల్‌ సెంటర్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయించినట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలని..


పరీక్షకు ముందురోజే ఎగ్జామ్‌ సెంటరుకు వెళ్లి చూసుకోవాలని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థుల్లో నెలకొన్న పలు సందేహాలకు సమాధానాలు ఇవిగో.. పరీక్ష కేంద్రాలు ఎన్ని? హైదరాబాద్‌లో రెండు


పరీక్ష కేంద్రాలతో కలిపి మొత్తంగా 145 పరీక్ష కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్‌ విభాగానికి మే 21 నుంచి 27వ తేదీ వరకు మొత్తం 14 సెషన్లలో


ఈఏపీసెట్‌ జరగనుంది. రెండు షిఫ్టుల్లో (ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఈ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో తప్పుల్ని


సరిదిద్దుకోవచ్చా? విద్యార్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించే సమయంలో సమాచారాన్ని తప్పుగా ఇచ్చినట్లయితే.. ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. పరీక్ష పూర్తయ్యాక కూడా ఈఏపీసెట్‌ హెల్ప్‌లైన్‌


సెంటర్‌ని సంప్రదిస్తే తప్పులను సవరిస్తామని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ తెలిపారు.  పరీక్ష కేంద్రంలోకి ఏమేం అనుమతిస్తారు? విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు (ఒరిజినల్‌), నలుపు లేదా


నీలం రంగు బాల్‌పాయింట్ పెన్ను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. బయో మెట్రిక్‌ నమోదుకు ఆటంకం లేకుండా విద్యార్థులు చేతులకు మెహందీ వంటివి పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. పరీక్ష కేంద్రానికి


చేరుకోవడం ఎలా? పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ను తెలుసుకొనేందుకు మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ చివరి పేజీలో గూగుల్‌ మ్యాప్‌ ఇచ్చారు. విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేలా ఏపీ ఈఏపీసెట్‌


వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టులు అందుబాటులో ఉంచారు. ఏ సెషన్‌లోనైనా పరీక్ష రాసుకోవచ్చా? అలా ఉండదు. మీ హాల్‌ టికెట్‌పై ఇచ్చిన తేదీ, సమయం ప్రకారం మీకు కేటాయించిన సెషన్‌లోనే పరీక్షకు హాజరు కావాల్సి


ఉంటుంది. వర్కింగ్‌ షీట్‌లు పరీక్ష కేంద్రంలోనే ఇస్తారా? అవును. వర్క్‌షీట్‌లు పరీక్ష కేంద్రంలోనే ఇస్తారు. వీటిపై విద్యార్థులు తమ క్యాలిక్యులేషన్‌లు చేయొచ్చు. పరీక్ష పూర్తయి బయటకు వెళ్లే సమయంలో


ఆ వర్క్‌షీట్‌లను ఇన్విజిలేటర్‌కు అందించాలి. ఆ షీట్‌లపై మీ హాల్‌టికెట్‌ నంబర్‌ రాయడం మరిచిపోవద్దు. ఏ సమయానికి పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయాలి? పరీక్ష ప్రారంభం కావడానికి కనీసం గంటన్నర


ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈలోపే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.  సీటింగ్ వివరాలు ఎలా తెలుసుకోవాలి?


పరీక్షా కేంద్రంలో బార్ కోడ్ స్కానింగ్, హాల్ టికెట్‌లో తేదీ ధ్రువీకరణ అనంతరం అభ్యర్థులు సీటింగ్ వివరాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులను వారి సంబంధిత కంప్యూటర్ ల్యాబ్‌లకు తీసుకెళ్లేందుకు సహాయక


సిబ్బంది అందుబాటులో ఉంటారు.  విద్యార్థులకు ఫొటో ఎక్కడ తీస్తారు? ఏపీ ఈఏసీపెట్‌ పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద పత్రాల ధ్రువీకరణ తర్వాత విద్యార్థులను ల్యాబ్‌/పరీక్ష హాలు వైపు తీసుకెళ్తారు.


పరీక్షా హాలు లోపలే ఇన్విజిలేటర్లు విద్యార్థి ఫొటో తీసుకుంటారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) లాగిన్‌ వివరాలను ఎప్పుడు? ఎక్కడ పొందాలి? పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు లాగిన్ ఐడీ,


పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు.  ప్రశ్నపత్రం తెలుగులోనూ చూడొచ్చా? ప్రశ్నపత్రం ద్విభాషా రూపంలో ఉంటుంది. విద్యార్థి ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రశ్నను చూడొచ్చు. నెగెటివ్‌ మార్కులు ఉంటాయా? లేవు.


ఉండవు. పరీక్ష సమయంలో క్వశ్చన్‌ ఫాంట్‌ సైజు పెంచుకోవచ్చా? అవును. ఫాంట్‌ సైజు పెంచుకోవచ్చు. స్క్రీన్‌ కుడి భాగంలో పైన జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌ బటన్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఫాంట్‌ సైజు


మార్చుకోవచ్చు.  ఒకసారి సమాధానం ఎంచుకొని సేవ్‌ చేస్తే.. మళ్లీ మార్చుకొనే వీలుంటుందా? ఎప్పుడైనా మార్చుకొనే వెసులుబాటు ఉంది. పరీక్ష రాసేటప్పుడు ఏ సమయంలోనైనా మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను


మార్చుకోవచ్చు.  సమాధానం సేవ్‌ అయిందో, లేదో తెలుసుకోవడం ఎలా? ఒక ఆప్షన్‌ను ఎంచుకుని, ‘సేవ్‌ & నెక్స్ట్’ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత.. కంప్యూటర్‌ స్క్రీన్‌ కుడి వైపున ఉన్న ప్రశ్న


ప్యాలెట్‌లో ఆ సంబంధిత ప్రశ్న నంబర్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారుతుంది. పరీక్ష సమయంలో టైమ్‌ను ట్రాక్ చేయొచ్చా? మీ సౌలభ్యం కోసం పరీక్ష ముగింపునకు మిగిలి ఉన్న సమయాన్ని కుడివైపు ఎగువ మూలలో టైమర్


ప్రదర్శిస్తుంది. పరీక్ష మధ్యలో వేరే సబ్జెక్టుకు లేదా ప్రశ్నకు మారవచ్చా? మీ పరీక్ష సమయంలోగా ఎప్పుడైనా, సంబంధిత సబ్జెక్టు పేరుపై క్లిక్ చేయడం ద్వారా పరీక్ష పేపర్‌లోని సబ్జెక్టు (విభాగం) లేదా


ప్రశ్న సంఖ్యను మార్చుకోవచ్చు. మొత్తం ప్రశ్నపత్రాన్ని ఒకేసారి చూడొచ్చా? చూడొచ్చు. కంప్యూటర్ స్క్రీన్ కుడి భాగంలో పైన ఉన్న ఆప్షన్లతో పాటు ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చూసేందుకు ప్రశ్నపత్రం బటన్‌పై


క్లిక్ చేయండి. (గమనిక: అయితే ఇక్కడ ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు) పరీక్ష రాసేటప్పుడు కంప్యూటర్‌లో ఏదైనా సమస్య వస్తే? మీ కంప్యూటర్‌లో ఏదైనా సమస్య వస్తే భయాందోళనకు గురికావొద్దు. మీ చేయి


పైకెత్తి ఇన్విజిలేటర్‌కు సమస్య గురించి చెప్పండి. మీకు మరో సిస్టమ్‌ను కేటాయిస్తారు. మీ టైమర్ అదే సమయంలో పునఃప్రారంభమవుతుంది. మీరు సమయం కోల్పోరు. అంతకుముందు మీరు రాసిన సమాధానాలు అలాగే ఉంటాయి.


  పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్‌ తీసుకెళ్లొచ్చా? లేదు. క్యాలిక్యులేటర్లను లోపలకు అనుమతించరు. మీకు ఇచ్చిన హాల్‌టికెట్‌లో సూచనలను క్షుణ్ణంగా చదవండి. మొబైల్‌ ఫోన్‌, డిజిటల్‌ వాచ్‌ల వంటి


ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.