
Retired lt gen ark reddy: పాక్ మరింత రెచ్చిపోతే పీఓకే, బలోచిస్థాన్ పోవడం ఖాయం: మాజీ లెఫ్టినెంట్ జనరల్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం: పాకిస్థాన్ కావాలనే భారత్‌ను రెచ్చగొడుతోందని, యుద్ధానికి పురిగొల్పుతోందని ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అన్నారు. ఒకవేళ ద్వైపాక్షిక చర్చలు,
వెనక్కి తగ్గుతామని ప్రకటించినా ఆ దేశాన్ని అంత సులువుగా నమ్మకూడదన్నారు. భారత్‌తో యుద్ధానికి కాలు దువ్వితే పాక్ ఆక్రమిత కశ్మీర్, బలోచిస్థాన్ వంటివి కోల్పోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
గత ఉదంతాలను పాక్ ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’, తదనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఈనాడు.నెట్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
కార్గిల్ యుద్ధ సమయంలో నార్తర్న్ కమాండ్‌కు చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించిన ఆయన.. వివిధ అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. పాక్ కావాలనే రెచ్చగొడుతోంది.. పహల్గాంలో పర్యాటకానికి వచ్చిన వారిని
మతం అడిగి మరీ పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. భారత్ కేవలం పాక్ ఉగ్రస్థావరాల మీదే దాడికి పాల్పడింది. మిలటరీ, పౌరుల జోలికి
పోలేదు. భారత్ తనంతట తానుగా యుద్ధాన్ని కోరుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. పాక్ పరిస్థితి వేరు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా.. భారత్‌ను చూసి ఓర్వలేక కావాలనే కయ్యానికి కాలు దువ్వుతోంది.
అక్కడి ప్రజలను, దేశ ఆర్థిక పరిస్థితి గురించి పట్టించుకునే పరిస్థితిలో ఆ దేశం లేదు. అక్కడి మిలటరీ ఏం చెప్తే అది. ఉగ్రవాదాన్ని మాత్రం వారు వదలరు. లష్కరే తయ్యిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర ముఠాలను
స్ట్రాటజిక్ అసెట్‌లుగా ఆ దేశం భావిస్తోంది. ఉగ్రవాదుల్ని ముందు పెట్టి మిలటరీ వెనుకుండి నడిపిస్తోంది. మన సన్నద్ధతలో మనం ఉండాలి.. భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా
ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఓ వైపు అక్కడి విదేశాంగ శాఖ చెబుతోంది. మరోవైపు తమ సైన్యాన్ని సరిహద్దులవైపు నడిపిస్తోంది. మన దృష్టి మరల్చేందుకు పాక్ ఇలాంటి కుయుక్తులను
పన్నుతుంటుంది. పాక్ ఎప్పుడు ఏ మూల నుంచైనా దాడి చేసే అవకాశం ఉంది. మన సన్నద్ధతలో మనం ఉండాలి. పాక్ ఓ వైపు డ్రోన్లను ప్రయోగిస్తోంది. స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రుల మీద దాడులు
చేస్తోంది. మనం పాక్ పౌరుల జోలికి పోకపోయినా.. దాయాది దేశం మాత్రం ఉన్మాదంతో ఈ తరహా దాడులకు పాల్పడుతోంది. తమ ఆర్మీ బలమైనదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి అక్కడి పౌరులకే ఆర్మీ
అంటేనే ఏహ్య భావం. వాళ్ల పట్ల ప్రజలకు ఉన్నది భయమే తప్ప.. గౌరవం కాదు. తగ్గాల్సింది పాకిస్థానే ఒకవేళ ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులను నిజంగా తగ్గించుకోవాలని ఆ దేశం అనుకుంటే పాకిస్థానే వెనక్కి
తగ్గాలి. పహల్గాంలో భార్య ముందు భర్తను, కుమారుడి ముందు తండ్రిని దారుణంగా హతమార్చారు. కావాలనే మనల్ని రెచ్చగొట్టారు. మన దగ్గర సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. మన సాయుధ బలగాలు దృఢంగా ఉన్నాయి. 140
కోట్ల మంది పౌరులు మన సాయుధ బలగాల వెంట ఉన్నారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్‌పై ఉసిగొల్పుతున్న పాకిస్థానే ఈ విషయంలో వెనక్కి తగ్గాలి. ఉగ్రవాదులు చనిపోతే అధికారికంగా అంత్యక్రియలు చేసే సంస్కృతి
ఆ దేశానిది. పీఓకే, బలోచిస్థాన్ పోవడం ఖాయం కార్గిల్ యుద్ధాన్ని దగ్గర నుంచి చూశా. అప్పట్లో నియంత్రణ రేఖ దాటకూడదన్న లక్ష్మణ రేఖ ఉండేది. కార్గిల్ యుద్ధంలో పాక్ ఓడిపోయినప్పుడు నవాజ్ షరీఫ్
ప్రభుత్వం కుప్పకూలింది. ముషారఫ్ అధికార పగ్గాలు చేపట్టారు. కార్గిల్ యుద్ధం అనేది ఆ దేశంలో రాజకీయ అస్థిరతకు కారణమైంది. తర్వాత ముషారఫ్ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోయింది. కానీ, ఇన్నేళ్లుగా
మన ప్రజాస్వామ్య ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. గతంలో భారత్‌తో పెట్టుకుని తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) కోల్పోయింది. కార్గిల్ విషయంలో ఎదురుదెబ్బ చూసింది. ఆర్థికంగానూ నష్టపోయింది. ఇప్పుడూ అదే
ధోరణిని కనబరిస్తే పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్ ఏమాత్రం వెనుకాడదు. మరోవైపు పాక్ బలోచిస్థాన్ రూపంలో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలోనైనా బలోచిస్థాన్ విముక్తి జరగొచ్చు.
పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్‌తోనూ గొడవలు ఉన్నాయి. భారత్‌తో యుద్ధానికి దిగే ముందు ఇవన్నీ పాక్ గుర్తించాలి. మన సాయుధ బలగాలు చాలా బలంగా ఉన్నాయి. అయినా కాదని కయ్యానికి కాలు దువ్వితే ఆ దేశానికి
భంగపాటు తప్పదు. మనదే పైచేయి.. తుర్కియే అనేది ఓ చిన్న దేశం. ఆ దేశం మన మీద వ్యతిరేకతతో పాకిస్థాన్‌కు డ్రోన్లను అందిస్తోంది. వాటివల్ల మనకు వాటిల్లే నష్టం తక్కువే. పాకిస్థాన్ దగ్గర అమెరికాకు
చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని భారత్ మీద వాడకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ వాడితే యుద్ధ సామగ్రి సరఫరాను అమెరికా నిలిపివేస్తుంది. చైనాకు పాకిస్థాన్ మీద పెద్ద ప్రేమ లేదు. చైనా,
పాక్ ఎకనమిక్ కారిడార్ దృష్ట్యా ఆ దేశానికి మద్దతు తెలుపుతోంది. ఒకవేళ మిలటరీ సప్లయ్ ఇచ్చినా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు యుద్ధ సామగ్రి సరఫరా చేసినా దాన్ని
వినియోగించడానికి కావాల్సిన నైపుణ్యం పొందడం అంత తేలిక కాదు. భారత్‌కు కూడా వివిధ దేశాలు యుద్ధ సామగ్రిని సరఫరా చేసేవాళ్లు ఉన్నారు. ఇంతకుముందులా పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి లేదు.
దేశీయంగానూ మిలటరీ సప్లయ్ పెరిగింది. * భారత్‌తో నేరుగా తలపడలేని పాకిస్థాన్ ఓ వైపు ఫేక్‌న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. యుద్ధ వ్యూహంలో దీన్నే సైకలాజికల్ వార్‌ఫేర్ అంటారు. ఇవన్నీ ప్రజల
దృష్టిని మరల్చడానికే తప్ప.. మన సైనిక బలగాలను ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు. ప్రజలు కూడా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.