
Pahalgam horror: ఉగ్రవాదుల ‘యూనిఫామ్’ కుట్రలు.. భద్రతా దళాలకు కొత్త సవాల్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులు గందరగోళానికి
గురవుతున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయపడుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి కూడా ముప్పును పసిగట్టడంలో ఇబ్బంది ఎదురవుతోంది. పహల్గాం దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు
పెరగడం ఆందోళనకరంగా మారింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తుల్లో వచ్చారని, వారు ఉగ్రవాదులను
తెలుసుకోలేకపోయామని నాడు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. అయితే, ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది
గుర్తించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక యూనిఫామ్‌లో కన్పించినట్లు సమాచారం. * భారత్ దాడి చేస్తే పాక్ కలుగులో దాక్కోవాల్సిందే: ఎయిర్ డిఫెన్స్ డీజీ
పహల్గాం ఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే కొద్ది రోజుల క్రితం పుల్వామాలోని థ్రాల్‌లో కార్డెన్ సెర్చ్ చేస్తుండగా..
ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో జైషేమహ్మద్ ఉగ్ర ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీన్ వనీ, యావర్ అహ్మద్ భట్‌ను బలగాలు
మట్టుబెట్టాయి. వీరి మృతదేహాలను పరిశీలించగా.. వారు ధరించినవి అచ్చం సైనిక దుస్తుల్లాగే ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జాకెట్, వారు ఉపయోగించిన పరికరాలు భద్రతా సిబ్బంది వినియోగించేవి గానే
ఉన్నాయి. దీంతో భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాయి. ఆ తర్వాత జమ్మూలోనూ ఇదేతరహా ఘటన వెలుగుచూసింది. మే 10న ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న సమయంలో జమ్మూలోని నగ్రోటా
మిలిటరీ స్టేషన్‌లో చొరబాటుకు యత్నం జరిగింది. దాన్ని భద్రతా దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఆ చొరబాటుకు యత్నించిన దుండగుడు కూడా మిలిటరీ దుస్తులు ధరించి సైనిక స్థావరం సమీపం వరకు వచ్చినట్లు
గుర్తించారు. ఆ తర్వాత అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కాల్పులు జరపగా దుండగుడు అక్కడినుంచి పారిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇలా ఉగ్రవాదులు సైనిక యూనిఫామ్‌ను ధరించడం భద్రతాపరంగా
తీవ్ర ఆందోళనకరమైన అంశంగా మారుతోంది. కొన్నిసార్లు వేగంగా ఆపరేషన్లు చేస్తున్న సమయంలో ఈ పరిణామాలు గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘‘ఈ ఎత్తుగడ కేవలం మోసం మాత్రమే కాదు ప్రమాదకర పరిణామాలకు
దారితీసే అవకాశం ఉంది. భద్రతా బలగాలు, స్థానిక పౌరుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీసేందుకు వేసే కుట్రలు ఇవి’’ అని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దీని గురించి
ఉన్నతస్థాయి సమావేశాల్లో చర్చించినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత సైనిక యూనిఫామ్‌లను పోలిన దుస్తులను విక్రయించకూడదని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు తీసుకొచ్చిన సంగతి
తెలిసిందే.