
Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)
పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని.. తేడా వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుజరాత్‌లోని భుజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి ఈ
వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చిన నిధులలో ఎక్కువ భాగాన్ని పాకిస్థాన్ తన దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని
పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్
ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాక్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని రాజ్‌నాథ్ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్ పాక్‌కు నిధులు
సమకూర్చడంపై పునరాలోచించాలని కోరారు. భవిష్యత్తులోనూ ఆ దేశానికి ఎలాంటి సహాయం అందించొద్దని కోరారు. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు భారత్ అర్థరాత్రి ఉదయపు వెలుగు ఎలా ఉంటుందో చూపించిందని.. మన
సైనికుల పరాక్రమం చూసి దేశ, విదేశాల్లోని భారతీయులు గర్విస్తున్నారని రాజ్‌నాథ్ అన్నారు. ఈ ఆపరేషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణి శక్తిని దాయాది దేశం కూడా
అంగీకరించిందని పేర్కొన్నారు. భుజ్ వైమానిక స్థావరం అనేక పాకిస్థాన్ డ్రోన్‌లను కూల్చడాన్ని ప్రస్తావిస్తూ..సైన్యాన్ని ప్రశంసించారు. 1965లోనూ పాకిస్థాన్‌పై మన విజయానికి భుజ్ సాక్షిగా నిలిచిందని
గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540
కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. మసూద్ అజార్‌కు పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని పాకిస్థాన్ ప్రధాని
షెహబాజ్ షరీఫ్ గురువారం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం
తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం మసూద్ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను
పునర్నిర్మిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు.