Tourist family telugu review: రివ్యూ: టూరిస్ట్‌ ఫ్యామిలీ.. రజనీ, రాజమౌళి మెచ్చిన చిత్రం ఎలా ఉంది?

Tourist family telugu review: రివ్యూ: టూరిస్ట్‌ ఫ్యామిలీ.. రజనీ, రాజమౌళి మెచ్చిన చిత్రం ఎలా ఉంది?

Play all audios:


tourist family telugu review || చిత్రం: టూరిస్ట్‌ ఫ్యామిలీ; నటీనటులు: ఎం.శశికుమార్‌, సిమ్రన్‌, మిథున్‌ జై శంకర్‌, కమలేష్‌, యోగిబాబు తదితరులు; రచన, దర్శకత్వం: అభిషన్‌ జీవింత్‌; స్ట్రీమింగ్‌


వేదిక: జియో హాట్‌స్టార్‌ ఏటా కొన్ని వందల సినిమాలు బాక్సాఫీస్‌ వద్దకు వస్తుంటాయి.. అందులో కొన్ని థ్రిల్‌ పంచుతాయి... ఇంకొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈ అంశాలన్నీ


కలిపి దానికి కాస్త ‘మానవత్వం’ జోడిస్తే వచ్చిన చిత్రమే ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. అందుకే రజనీకాంత్‌, రాజమౌళిలాంటి దిగ్గజాలు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. హృదయాన్ని కదిలించి, కడుపుబ్బా నవ్వించిందని


కితాబిచ్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ క్లైమాక్స్‌లో రేలంగి మావయ్యగా ప్రకాశ్‌రాజ్‌ ఓ డైలాగ్‌ చెబుతాడు. ‘ఎదురొచ్చిన వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ పోతే చాలు. మనుషులు మంచోళ్లు..


మనిషంటేనే మంచోడు’ అంటాడు. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’లో కీలక పాత్ర పోషించిన ధర్మదాస్‌ (ఎం.శశికుమార్‌) మనస్తత్వం అదే. శ్రీలంకలో బతకలేక భార్యబిడ్డలను తీసుకుని అక్రమంగా భారత్‌లోకి వస్తాడు. అలా వచ్చిన


వారి కుటుంబం కేశవనగర్‌ కాలనీలో దిగుతుంది. సరిగ్గా అదే రోజున రామేశ్వరంలో ఓ బాంబు బ్లాస్ట్‌ జరుగుతుంది. శ్రీలంక నుంచి వచ్చిన ఓ కుటుంబం దీని వెనుక ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. మరి, నిజంగా ఆ


ఘటనకు ధర్మదాస్‌ కుటుంబమే కారణమా? పోలీసులకు పట్టుబడకుండా ధర్మదాస్‌ కుటుంబం ఎలా బయటపడింది? అన్నది చిత్ర కథ. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ పాయింట్‌పరంగా సింపుల్‌గా కనిపించవచ్చు. కానీ, ప్రతి సన్నివేశం ఓ


అందమైన పువ్వులా పరిమళాన్ని పంచుతుంది. సినిమా ప్లే చేయగానే ప్రేక్షకుడు ధర్మదాస్‌ ఫ్యామిలీలో ఒకటైపోతాడు. చిన్న కొడుకు చేసే చిలిపి పనులకు నవ్వుతాడు.. పక్కంటి గుణశేఖర్‌, అతని భార్యను


తల్లిదండ్రులుగా భావించి ధర్మదాస్‌ భార్య వసంతి (సిమ్రన్‌) చూపించే అనురాగానికి ముగ్ధుడవుతాడు.. తండ్రి కష్టం చూడలేక పెద్ద కొడుకు నితూషన్‌ (మిథున్‌) పడే ఆవేదనకు కళ్లు చెమర్చి భావోద్వేగానికి


గురవుతాడు. వీటన్నింటికీ మించి ధర్మదాస్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం  మెప్పిస్తుంది. ఇలా ప్రతి సన్నివేశం ఏదో ఒక ఎమోషన్‌తో ముగిసేలా దర్శకుడు అభిషాన్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా


బాగుంది. ఆరంభం సన్నివేశాల్లో ధర్మదాస్‌ కుటుంబాన్ని కలిసే ప్రతి పాత్రా ఆ తర్వాత కథలో ఏదో ఒక సమయంలో ప్రత్యక్షమవుతుంది. మొదటిసారి చూస్తున్నప్పుడు మనకు ఆ విషయం తెలియదు. కానీ, రెండోసారి తెరపైకి


వచ్చినప్పుడు చిన్నపాటి థ్రిల్‌ ఇవ్వడంతో పాటు, వినోదాన్ని పంచుతుంది. ఇది మాత్రమే కాదు, నానాటికీ మనిషిలో దిగజారిపోతున్న విలువలకు నిలువెత్తు రూపంగా ధర్మదాస్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానం


మెప్పిస్తుంది. బాంబ్‌ బ్లాస్ట్‌కు కారణమైన వారిని వెతుక్కుంటూ క్లైమాక్స్‌లో పోలీసులు ధర్మదాస్‌ కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు నడిచే డ్రామా థ్రిల్‌ను పంచుతుంది. ధర్మదాస్‌ కుటుంబం వెనుక కేశవనగర్‌


కాలనీ మొత్తం నిలబడే సన్నివేశం సినిమాకే హైలైట్‌. మొత్తంగా ఒక ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్‌ ఎక్కిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు మనకు నిజ జీవిత పాత్రలే దర్శనమిస్తాయి తప్ప


మరొకరు కనిపించరు. రాముడికి ‘పూర్వభాషీ ప్రియంవదః’ అనే సుగుణం ఉంది. ఎవరు తనకు కనిపించినా ముందుగా ఆయనే ఎదుటి వారిని పలకరించేవాడట. దర్శకుడు ధర్మదాస్‌ పాత్రకు ఆ సుగుణాన్ని ఆపాదించి తీర్చిదిద్దిన


విధానం బాగుంది. ధర్మదాస్‌ భార్య వసంతిగా సిమ్రన్‌, కుమారులుగా మిథున్‌, కమలేశ్‌ జగన్‌ చక్కగా ఒదిగిపోయారు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఎంతో హృద్యంగా నటించింది. సాంకేతికంగా సినిమా చాలా


బాగుంది. అన్ని విభాగాలు చక్కగా పనిచేశాయి. దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ని ఒక అందమైన కథలా ప్రేక్షకులకు అందించారు. కుటుంబంతో చూడొచ్చా: కుటుంబంతో కలిసి తప్పకుండా చూడాలి. ఎక్కడా


ఒక్కచోట కూడా అసభ్య సంభాషణ, సన్నివేశం కూడా లేదు. తెలుగు ఆడియోలోనూ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. * బలాలు * + ధర్మదాస్‌ కుటుంబం * + కామెడీ, ఎమోషన్స్‌ * + డైరెక్షన్‌, నిడివి *


బలహీనతలు * - కనిపించలేదు * చివరిగా: టూరిస్ట్‌ ఫ్యామిలీ.. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన మూవీ! * గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!