
Elon musk: ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్
Play all audios:

అమెరికా: టెస్లా సీఈవో, అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఎక్స్‌లో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ఈసందర్భంగా మస్క్
పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని
ఆకాంక్షించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో
వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేకమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో
ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇక, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని
వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి
డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ
వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్
వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు.