
Srh vs kkr: హ్యాట్రిక్ విజయంతో అదిరే ముగింపు.. కోల్‌కతాపై సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ
Play all audios:

దిల్లీ: ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) భారీ విజయంతో ముగించింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత జోరందుకున్న హైదరాబాద్.. కోల్‌కతా
నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో అంతకుమించిన దూకుడు ప్రదర్శించి వరుసగా మూడో విజయంతో ఈ సీజన్‌కు టాటా చెప్పింది. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై హైదరాబాద్ 110 పరుగుల తేడాతో
సూపర్ విక్టరీ సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (105*; 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు శతకం బాదడంతో తొలుత సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత
లక్ష్యఛేదనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. మనీశ్ పాండే (37; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (34*; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో
మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ సునీల్ నరైన్ (31; 16 బంతులలో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా దాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. అజింక్య రహానె (15), అంగ్‌క్రిష్ రఘువంశీ (14),
రమణ్‌దీప్ సింగ్ (13), క్వింటన్ డాకాక్ (9), రింకు సింగ్ (9) పరుగులు చేశారు. రస్సెల్ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కత్ (3/24), ఎషాన్
మలింగ (3/31), హర్ష్ దూబె (3/34) అదరగొట్టారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మొదటి నుంచీ దూకుడే.. సన్‌రైజర్స్ బ్యాటర్లలో క్లాసెన్ శతకానికితోడు
ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపూ మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్
(29; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో రెండే పరుగులు రాగా.. తర్వాత నుంచి హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం మొదలైంది. వైభవ్ వేసిన మూడో ఓవర్‌లో
రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదిన హెడ్.. హర్షిత్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. నరైన్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదిన అభిషేక్ తర్వాత బంతికే ఔటైపోయాడు. కాసేపటికే హెడ్ అర్ధ శతకం (26 బంతుల్లో)
అందుకున్నాడు. మరోవైపు, క్రీజులోకి వచ్చిన క్లాసెన్ కూడా దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వరుణ్ బౌలింగ్‌లో క్లాసెన్ మూడు ఫోర్లు బాదేయడంతో 10 ఓవర్లకు స్కోరు 139/1కి చేరింది.
హర్షిత్ బౌలింగ్‌లో క్లాసెన్ వరుసగా 4, 6, 6 కొట్టి 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తర్వాత నరైన్ బౌలింగ్‌లో హెడ్.. రస్సెల్‌కు చిక్కాడు. క్లాసెన్, ఇషాన్ జోరు కొనసాగించడంతో 18 ఓవర్లకు
స్కోరు 250 దాటింది. దీంతో సన్‌రైజర్స్ తన పేరిట ఉన్న 287/3 స్కోరు రికార్డును తిరగరాస్తుందేమో అనిపించింది. అయితే, తర్వాతి ఓవర్లో వైభవ్ ఇషాన్‌ను ఔట్ చేసి ఏడు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 17
పరుగులే రావడంతో కొత్త రికార్డు నమోదు కాలేదు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టారు. * ఐదు వరుస ఓటముల తర్వాత కోల్‌కతాపై హైదరాబాద్‌కు ఇది మొదటి విజయం. * ఐపీఎల్‌లో
కోల్‌కతాకు ఇది అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2018లో ముంబయిపై 102 పరుగుల తేడాతో ఓడింది. * హైదరాబాద్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. 2019లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ 118 రన్స్ తేడాతో గెలిచింది.